కొంతమంది పిల్లలు మ్యూజిక్, పెయింటింగ్, గేమ్స్ ఇలా తదితర వాటిపై ఆసక్తిని మరియు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కానీ పేరెంట్స్ అందరూ వారి పిల్లలను అర్థం చేసుకోక పోవచ్చు. కొందరు వారి పిల్లలకు నచ్చిన విధంగా వారికిష్టమైన వాటిలో నైపుణ్యం పొందేందుకు ప్రోత్సహిస్తే, మరికొందరు మాత్రం అవన్నీ ఎందుకు పనికిరావు, జీవితంలో చదువు మాత్రమే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది, చదువు లేకపోతే ఈ సమాజంలో గౌరవం ఉండదు అంటూ తమ పిల్లలను నిరుత్సాహపరుస్తుంటారు. బలవంతంగానైనా వారి ఇష్టాలను పక్కనపెట్టి చదవాల్సిందే అంటూ చెబుతుంటారు. టెన్త్ క్లాస్, డిగ్రీలు లేనిదే భవిష్యత్తులో ఎందుకూ పనికి రావు అంటూ, ఏ జాబ్ దొరకదు అంటూ ఎలా బ్రతుకుతావు అంటూ తమ పిల్లలకి బ్రెయిన్ వాష్ చేస్తుంటారు.
వాస్తవానికి చదువు ఉంటేనే భవిష్యత్తులో విలువ ఉంటుంది, ఆర్థికంగా బాగుంటారు అన్నది నిజం కాదు. విద్య అవసరమే కావచ్చు, కానీ చదువు లేకపోతే జీవితమే లేదన్నది ఎంత మాత్రం సరి కాదు. ఎంతోమంది కనీసం టెన్త్ క్లాస్ పాస్ అవని వారు సైతం నేడు ఈ సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించినవారున్నారు. అలాగని చదవాల్సిన అవసరం అస్సలు లేదని కాదు విద్య జ్ఞానాన్ని ఇస్తుంది , క్రమశిక్షణ నేర్పుతుంది , సబ్జెక్టుపై పట్టు ఇస్తుంది. కానీ పిల్లల ఇష్టం మరియు అయిష్టాలను తెలుసుకోవాలి. ఒకవేళ వారికి కనుక చదువుపై కంటే కూడా ఇతర కళలపై ఆసక్తి ఎక్కువగా ఉంటే వాటిని నేర్చుకుని మరింత ముందుకు సాగడానికి అవకాశం ఇవ్వాలి. వారి ఇష్టాలను గౌరవించాలి, నమ్మకానికి అండగా నిలబడాలి. ఒక వైపు విద్య యొక్క ప్రాముఖ్యత చెబుతూనే మరోవైపు వారి ఆలోచనలకు రూపం ఇవ్వాలి, అంటే వారికి ఎందులో అయితే ఆసక్తి ఉంటుందో అందులో నైపుణ్యం పొందడానికి ప్రోత్సాహం అందించాలి. అప్పుడే వారు ఎంతో ఇష్టంగా నేర్చుకొని అందులో నిష్ణాతులు అవుతారు. తద్వారా వారి భవిష్యత్తు కూడా బాగుంటుంది.