
చెడ్డ మిత్రులకన్నా అసలు మిత్రులు లేకపోవడమే ఉత్తమమన్నారు మార్టిన్ లూథర్ కింగ్. చెడ్డ మిత్రులను కనుక ఎంచుకుంటే మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మనం కూడా చెడు అలవాట్లకు మెల్లమెల్లగా దగ్గరయ్యే అవకాశం ఉంది. అవి మనకు హాని కూడా కలిగించవచ్చు. అదే ఒక మంచి స్నేహితుడిని ఎంచుకుంటే మీకు కష్ట నష్టాలలోనూ, మంచి చెడులలోనూ తోడుంటారు. బుద్ధిమంతులైన మంచి స్నేహితులు మనకు తోడుగా ఉంటే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. మనం జీవితంలో మరింత అభివృద్ధి చెందడానికి వారు మనకు అన్ని రకాలుగా సహాయపడతారు.
భావం సరైనది అయితే ప్రేరణ సరిగ్గా వుంటుంది, ప్రేరణ సరియైనదయితే కార్యాచరణ సరిగ్గా వుంటుంది. కార్యాచరణ సరిగ్గా వుంటే విజయం మన సొంతమవుతుంది. ఒక మంచి స్నేహితుడు మనకు ఉంటే, ప్రేరణ మన కార్యాచరణ సవ్యంగా ఉంటాయి. అలాగే మనకు గౌరవం కూడా లభిస్తుంది. నేటి తరంలో చుట్టాలు లేనివారు ఉన్నారేమో కానీ, స్నేహితులు లేనివారు మాత్రం లేరు. అయితే ఇక్కడ విషయం ఎంత మంది స్నేహితులున్నారు అన్నది కాదు. ఎంత మంది మంచి స్నేహితులు ఉన్నారు అన్నది ప్రధానం. మన స్నేహితులను చూస్తే మనం ఏంటో అంచనా వేస్తుంది ఈ సమాజం. కాబట్టి మంచి స్నేహితులను ఎంచుకోండి. మంచి గుర్తింపు తెచ్చుకోండి.