మాములుగా చాలా మంది అనవసరమైన ఆలోచనలతో ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలవుతుంటారు. కొందరికి ఏ పని చేద్దాం అన్నా దాని ద్వారా ఏం సమస్య వచ్చి పడుతుందోనని లేనిపోని భయాలతో అనవసరంగా ఆందోళన చెందుతుంటారు. ఇది జరగదేమో, అది కుదరదేమో అన్న నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా మనసులోకి వస్తుంటాయి. అనవసరమైన భావోద్వేగాలకు లోనవుతుంటారు. అవి ఎలాంటివంటే జీవితంలో సరైనవి కావు అని అనిపించేటటువంటివి. కానీ వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితుల్లో చాలా మంది సతమతమవుతుంటారు. ఇటువంటి వాటిని ఎలా దూరం చేసుకోవాలి అంటే ముందుగా మనకు వచ్చే మన నెగిటివ్ థాట్స్ ఏ రకమైనవి అనేది మనకు మనం పరిశీలించుకోవాలి మరియు వాటిని గుర్తించి దూరంగా ఉండాలి.
ప్రధానంగా నెగటివ్ ఆలోచనలు అనేది ఎక్కువగా మనకున్న ఒత్తిళ్ల వలన కలుగుతుంటాయి. ఉదాహరణకు కొందరికి టీవిలో ఏదైనా బాధాకరమైన వార్తలను చూసినప్పుడు, అలాంటి సమస్య వారి జీవితంలో ఎదురవుతుంది ఏమో అని తమకు తెలియకుండానే ఆలోచనలో పడతారు. వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ మనస్థాపానికి లోనవుతుంటారు. కాబట్టి అలా ఒత్తిడిని కలిగించే విషయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఆ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
మనకు కలిగే నెగటివ్ ఆలోచన నుండి బయటపడడానికి వీలైనంత వరకు మనకు నచ్చిన వారితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. అదే విధంగా ఎక్కువగా ఆహ్లాదకరమైన బుక్స్ చదవడం, మనసుకు నచ్చే పనుల్లో నిమగ్నం కావడం వంటివి చేయాలి. లేదంటే ఆ నెగటివ్ ఆలోచనలతో మనసు మరింత ఒత్తిడికి లోనై లేని పోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి అవి మనకు ప్రమాదకరం కావచ్చు. కాబట్టి నెగటివ్ ఆలోచన వస్తున్న మొదట్లోనే వాటిని నియంత్రించేందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడే వాటి నుండి బయట పడగలరు. సంతోసమే సగం బలం. కాబట్టి యూవంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా సంతోషంగా జీవించాలి.