ఇక్కడ ఆ వ్యక్తి యొక్క చదువు లేదా నైపుణ్యం హార్డ్ స్కిల్స్ అయితే, మనకున్న ఆ నైపుణ్యాలను వినియోగించి అనుకున్న ఉద్యోగాన్ని సాధించగల సామర్ధ్యాలను సాఫ్ట్ స్కిల్స్ అంటాము. వివరంగా చెప్పాలంటే డిగ్రీ చదివిన వ్యక్తి ఉద్యోగానికి వెళ్లినప్పుడు, అతడు తన డిగ్రీని ఉపయోగించి ఆ ఉద్యోగం పొందడానికి సమర్థుడని ఎదుటి వారికి అర్థమయ్యేలా వివరించి ఒప్పించగలిగే నైపుణ్యమే ఇక్కడ సాఫ్ట్ స్కిల్ అని చెప్పవచ్చు. ఇక్కడ డిగ్రీ అనేది హార్డ్ స్కిల్స్ కింద వస్తుంది. కేవలం ఉద్యోగానికి మాత్రమే కాదు జీవితంలో ఎన్నో చోట్ల ఎదుటివారిని ఒప్పించడం లేదా కన్విన్స్ చేయడం లేదా నమ్మించడం ఇలా పలు రకాలుగా అర్థమయ్యేలా చేసి మనతో ఏకీభవించేలా చేయాల్సిన అవసరం వస్తుంది.
ఇలాంటి సమయంలో కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోవు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉన్నప్పుడే ఎదుటివారికి అర్థం అయ్యేలాగా వివరించి మనల్ని అర్థం చేసుకునేలా చేయగలం. ఇందుకు ముందుగా ఎదుటి వారి గురించి ఎంతో కొంత మనకు తెలిసి ఉండాలి. అప్పుడే వారి దారిలో వెళ్లి వారికి నచ్చే విధంగా వ్యవహరించి మనల్ని అర్థం చేసుకునేలా చేయగలం ఇది కూడా ఒక రకమైన సాఫ్ట్ స్కిల్. మనకు అవసరమైన పనిని ఎదుటి వారి చేత చేయించుకోవడం కోసం వారిని నొప్పించకుండా వారి దారిలోనే వెళ్లి బాగా అర్థమయ్యేలా చేసి చివరికి పని పూర్తి చేయడమే సాఫ్ట్ స్కిల్ అవుతుంది.