తెలంగాణ సర్కారు హరిత హారం పేరిట పర్యావరణ హిత కార్యక్రమం నిర్వహిస్తోంది. గత కొన్నేళ్లుగా ఏటా తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. దీని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం ఉంది. అయితే ఇలా ప్రభుత్వాలే కాకుండా కొందరు వ్యక్తులు కూడా పర్యావరణం కోసం తమ ప్రాణం పెడుతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి వనవాసి రామయ్య కథ పాఠ్య పుస్తకాలకు కూడా ఎక్కింది. అలా మన వనవాసి రామయ్య తరహాలోనే ఒడిశాలో ఓ పెద్దాయన మొక్కల పెంపకం కోసం 50 ఏళ్లుగా కృషి చేస్తున్నాడు.  


ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అంతర్యామి సాహూ.. ఆయన ఓ ఉపాధ్యాయుడు.. ఇప్పుడు రిటైర్ అయ్యారు లెండి.. కానీ.. తన హరిత ప్రతిజ్ఞ నుంచి మాత్రం ఆయన విశ్రాంతి తీసుకోలేదు. ఆయన హరిత ప్రతిజ్ఞ ఏంటంటే.. ప్రతి రోజూ ఓ మొక్క నాటాలని యాభై ఏళ్ల క్రితం ఆయన ప్రతిజ్ఞ చేసుకున్నారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా రోజూ ఓ మొక్క నాటుకుంటూ వస్తున్నారు. 1961 లో మొదలు పెట్టిన సాహూ తాత హరిత యజ్ఞం 50 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది.  


పర్యవరణం కోసం పని చేయడంలో ఎంతో ఆనందం ఉందంటాడు అంతర్యామి సాహూ తాత. తాను ఏళ్ల తరబడి ఈ పని చేస్తున్నానని.. అది తనకు రోజూ ఉత్సాహాన్ని ఇస్తుందని అంటున్నాడు. పర్యావరణం కోసం తన వంతుగా ఈ ప్రయత్నం చేస్తున్నానని.. ఇలా అవకాశం ఉన్న వారంతా చేయాలని ఆయన కోరుతున్నారు. అందుకే ఆయన తాను మొక్కలు నాటడమే కాదు.. తన చుట్టూ ఉన్న వారిని కూడా మొక్కలు నాటేందుకు ప్రోత్సహిస్తుంటారు.


ఇలా అంతర్యామి తాత చేస్తున్న హరిత యజ్ఞానికి ఆ రాష్ట్రంలో మంచి గుర్తింపు లభించింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ప్రత్యేకంగా అంతర్యామి సాహూ కృషి గురించి తెలుసుకుని ప్రశంసించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాజెక్టులలో ఆయన సలహాలు తీసుకుంటున్నారు. శభాష్ సాహూ తాత..!

మరింత సమాచారం తెలుసుకోండి: