ఆ అభిప్రాయం పాజిటివ్ గానా లేక నెగిటివ్ గానా అన్నది మీలో వచ్చిన ఆ మార్పుపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అది మంచిదే అయితే పర్వాలేదు. కానీ ఆ మార్పు మీకు కానీ, మీ సన్నిహితులకు కానీ ఇబ్బంది పడేలా ఉన్నా, బాధ కలిగించినా అది ఎంతో కొంత సమస్యాత్మకమే. ఉదాహరణకు తరచూ తన కుటుంబీకులతో సున్నితంగా, సరదాగా మాట్లాడే వ్యక్తి ఉన్నట్టుండి వారితో కటువుగా మాట్లాడటం, తక్కువ మాట్లాడటం లేదా చిరాకు పడుతుండడం వంటి మార్పులు మీలో వచ్చినట్లయితే మీతో ఉన్నవాళ్లు మీలో వచ్చిన ఈ మార్పు వలన, ప్రవర్తించే వైఖరి కారణంగా చాలా ఇబ్బందిపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ బాంధవ్యాల నడుమ తీరని అగాధం ఏర్పడవచ్చు.
మీ మార్పుకు కారణాలు ఎన్నో ఉండొచ్చు, ఒత్తిడి, నిరాశ ఇలా ఏదైనా అయి ఉండొచ్చు. కానీ దాన్ని వ్యక్త పరిచే విధానం మాత్రం ఇది కాదు. ఇటువంటి మార్పుల వలన మానవ సంబంధాల మధ్య దూరం ఏర్పడుతుంది. ఎంతో మంది భార్య- భర్త, అన్న-తమ్ముళ్లు, అక్కా- చెల్లెళ్ళు ఇలా చాలా బంధాల మధ్య గొడవలు ఏర్పడి చివరికి ఆ సంబంధాలు తెగిపోయిన సందర్భాలు కూడా మీరు చూసే ఉంటారు. కాబట్టి మీలో వచ్చే మార్పు మీకు మంచి చేసేదిగా ఉండాలి. మీ అభివృద్ధికి ఉపయోగపడేదిగా ఉండాలి. అందుకే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి.