తల్లితండ్రులు తమ పిల్లల మంచి భవిష్యత్తు కొరకు వారికి తొలుత మంచి జ్ఞాన నిర్మాణం జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. పిల్లలు చూసింది, వినింది, చెప్పిందే నేర్చుకుంటారు. తద్వారా వారికి జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. అందుకే పిల్లలను మంచి వాతావరణంలో పెంచాలి. చిన్నప్పటి నుండి మంచి అలవాట్లను నేర్పాలి, మంచి విషయాలను వారి బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడే అంశాలపై అవగాహన కల్పించాలి. చిన్నారుల జ్ఞాన సముపార్జనకు మార్గం చూపించాలి. ఆ తర్వాత వారి వారి సామర్ధ్యతను బట్టి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. తద్వారా వారి లక్ష్యం సులువుగా నెరవేరుతుంది.
మీరు మీ పిల్లలకి ఎంత ముడి జ్ఞానాన్ని అందించడానికి సహాయ పడతారో వారు వారి జీవన పయనంలో అంతకు పది రెట్లు జ్ఞానాన్ని పొందుతారు. ఆ జ్ఞానానికి కష్టాన్ని జోడించి వారు కోరుకున్న ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఈ సందర్భంగా మరో సారి గుర్తు చేస్తున్న విషయం ఏమిటంటే పిల్లలకు తల్లితండ్రులు తొలి గురువులు. వారి భవిష్యత్తు యొక్క స్థితిగతులు ఎక్కువ భాగం మీరు నేర్పే, ఇచ్చే అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిలల్ల పట్ల జాగ్రత్తగా ఉండండి.