తెలంగాణలోని సికింద్రాబాద్ మౌలాలిలో పుట్టి పెరిగిన రతిన్ బత్తుల నరసింహారావు.. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ఆర్మీలో లెఫ్టినెంట్ ఆఫీసర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. చిన్నప్పటి నుంచి దేశభక్తి ఎక్కువగా ఉన్న రతిన్‌దేశ సేవే లక్ష్యంగా సైన్యంలో ప్రవేశించాలని కలలు కన్నాడు. మౌలాలీలో పుట్టిన రతిన్ తండ్రి ఉద్యోగరీత్యా ఎక్కువగా ముంబయిలో పెరిగారు. అక్కడే ఆరో తరగతి వరకు చదివారు. అక్కడి నుంచి తండ్రికి పుణెకు బదిలీ అయ్యింది. అయితే రెండేళ్ల పాటూ హైదరాబాద్‌నే అమ్మతో పాటూ ఉన్నారు.
ఆ సమయంలో 7, 8వ తరగతి హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో రతన్ చదివారు. అమ్మ కల్పనారావు ప్రోత్సాహంతో ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్‌లో చేరాడు రతిన్. ఆ తర్వాత మళ్లీ ముంబయి వెళ్లి అక్కడే ఇంటర్, ఇంజినీరింగ్ చదివాడు. ఇంజినీరింగ్ మూడో ఏడాదిలో ఉన్నప్పటి నుంచే ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎయిర్ ఫోర్స్‌లో చేరేందుకు ప్రయత్నించి ఇంటర్వ్యూల దాకా వెళ్లినా ఎంపిక కాలేదు.
అయినా రతన్ నిరాశ చెందలేదు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఏడాది పాటూ ఓ ప్రైవేటు సంస్థలో డిజిటల్ అనలిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఇంజినీరింగ్‌లో 80 శాతానికి పైగా మార్కులు సాధించిన అభ్యర్థులకు నిర్వహించే టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్స్(టీజీసీ)లో ప్రవేశం పొందాడు. అలా రతిన్ ఇండియన్ మిలటరీ అకాడమీలో చేరి ఇటీవల శిక్షణ విజయవంతంగా పూర్తిచేశాడు.
ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న ఎందరో.. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం అర్రులు చాస్తుంటే.. రతిన్ మాత్రం సైన్యంలో చేరడమే లక్ష్యంగా కష్టపడ్డారు. ఆర్మీలో చేరేందుకు ఉన్న పరీక్షలు నెగ్గడం అంత సులభం కాదు.. మొత్తం ఐదు దశల్లో పరీక్షలు దాటి రతిన్ లెఫ్టినెంట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. కఠిన పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడటమే అతని విజయరహస్యం అంటారు అతని తల్లి కల్పనారావు.
సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన రతిన్ తల్లి కల్పనారావు.. ఉద్యోగరీత్యా దేశంలోని అనేక ప్రాంతాల్లో పని చేశారు. అనేక కార్పొరేట్ సంస్థల్లో హెచ్‌ఆర్ రంగంలో ఉన్నతపదవులు నిర్వహించిన కల్పనారావు రతిన్ సైన్యంలో చేరతానంటే ప్రోత్సహించారు. పిల్లలు సాఫ్ట్‌వేర్ రంగంలోకి వెళ్లి లక్షలు లక్షలు సంపాదించాలన్న కోరిక కాకుండా.. వారు ఎంచుకున్న రంగంలో ప్రోత్సహించడమే మంచిదంటారు కల్పనారావు. సైన్యంలోకి పంపాలంటే తల్లిగా భయంగా అనిపించలేదా అంటే.. దేశం కోసం పని చేసే అవకాశం రావడం గర్వకారణమని తెలిపారు. తన తాత కూడా
సైనిక అధికారి జె.ఎన్.చౌదరి వద్ద పీఏగా పని చేశారని.. రతిన్ ఆ వారసత్వాన్ని నిలబెట్టారని ఆమె ఒకింత గర్వంగా తెలిపారు.