దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత మొదలైన పరిణామాలు పోలీసులకు పెద్ద తలనొప్పగా మారిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున శంషాబాద్ మండలంలోని చటాన్ పల్లి ప్రాంతంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఎప్పుడైతే ఎన్ కౌంటర్ జరిగిందని తెలిసిందో  చుట్టు పక్కల ప్రాంతాల నుండి జనాలు వచ్చేస్తున్నారు. హత్యాచారం ఘటన జరిగిన తర్వాత కూడా ఆ ప్రాంతానికి జనాల తాకిడి బాగా పెరిగిపోయింది. నేషనల్ హై వే కావటంతో రోడ్డుపై వచ్చి పోయే వాహనాలన్నీ ఘటన జరిగిన ప్రాంతంలో ఆగిపోయేవి.

 

అప్పట్లో దిశపై సానుభూతి, నిందితులపై ఆగ్రహంతో జనాలు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించేవారు. ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత దిశ ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవటం, నిందితులకు సరైన శిక్షే పడిందన్న తృప్తితో జనాలు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించటానికి వస్తున్నారు.

 

అప్పుడైనా ఇప్పుడైనా విపరీతంగా వస్తున్న జనాలను కంట్రోల్ చేయటానికి పోలీసులు నానా అవస్తలు పడుతున్నారు. అప్పట్లోనేమో దర్యాప్తులో ఆధారాలు ఎక్కడ దెబ్బ తింటాయో అన్న ఆందోళనతో పోలీసులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడేమో కోర్టు విచారణలో సమాధానం చెప్పుకోవటానికి అవసరమైన ఆధారాలు పాడైపోతాయన్న టెన్షన్ పడుతున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం కూడా నేషనల్ హైవేకి దగ్గరలోనే ఉండటంతో జనాలు విపరీతంగా వచ్చేస్తున్నారు. దాంతో జనాలను కంట్రోల్ చేయటం పోలీసులకు సవాలుగా మారింది.

 

నిజానికి ఎన్ కౌంటర్ చేయటం, బహిరంగంగా ఉరి తీయటం, రాళ్ళతో కొట్టి చంపేయటం లాంటి శిక్షలను మన చట్టం, న్యాయ వ్యవస్ధలు అంగీకరించవు. ఈ విషయం తెలిసినా జనాలు ఆస్ధాయిలో డిమాండ్లు చేస్తున్నారంటే దిశకు జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా జనాలు ఏ స్ధాయిలో స్పందించారో  తెలుసుకోవచ్చు. మొత్తం మీద జనాగ్రహాన్ని తట్టుకోవటం పోలీసుల వల్ల కావటం లేదు. భవిష్యత్తులో అయినా ఇటువంటి ఘటనలు జరగకుండా ఆగిపోతాయేమోనని ఆశించటం తప్ప చేయగలిగేదేమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: