నాన్ వెజ్ ప్రియులు మటన్ ను అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మటన్ తినటం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మటన్ లో శరీరానికి అవసరమయ్యే పోషక విలువలు అన్నీ ఉంటాయి. అలాగే మటన్ లో ఫ్యాట్ తక్కువ ప్రమాణాలలో ఉండగా ప్రోటీన్లు, ఐరన్ ఎక్కువ ప్రమాణాలలో ఉంటాయి.
శరీరానికి మటన్ మంచి పౌష్టికాహారం. మటన్ లో అధికంగా ఉండే కాల్షియం దంతాలకు, ఎముకలకు పోషకాలను అందించి వాటిని ధృఢంగా ఉండేలా చేస్తుంది. అలాంటి ఈ మటన్ పచ్చడి ఏలా చేయాలో మీకు తెలుసా? ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? అలాంటి ఈ మటన్ పచ్చడిని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు..
బోన్‌లెస్ మటన్ - అరకేజీ,
ఉప్పు - తగినంత,
పసుపు - ఒక టేబుల్ స్పూన్,
అల్లంవెల్లుల్లి పేస్టు - 2 టేబుల్ స్పూన్లు,
నీళ్లు - అరకప్పు,
మెంతులు - అర టీస్పూన్,
జీలకర్ర - అర టీస్పూన్,
ధనియాలు - అర టీస్పూన్,
కారం - 2 టేబుల్ స్పూన్లు,
నూనె - సరిపడా,
నిమ్మరసం - పావు కప్పు,
వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు.
తయారీ విధానం..
ముందుగా మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి వేగించుకుని, మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. మటన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక పాత్రలో మటన్ వేసి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి, అర కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లు పూర్తిగా పోయే వరకు ఉడికించాలి. తరువాత అందులోనే కొద్దిగా నూనె వేసి మటన్ ముక్కలు ఫ్రై చేసి కారం వేసి కలపాలి. పొడి చేసి పెట్టుకున్న మసాలా వేయాలి. నిమ్మరసం వేసి మరికాసేపు ఉడికించాలి. నూనె తేలే వరకు ఉడికించి దించాలి. అంతే మటన్ పచ్చడి రెడీ..