అమ్మ అంటే సృష్టికి మూలం. అమ్మ  లేనిదే సృష్టే లేదు. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మన కంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మే పసిగడతుంది.బిడ్డ ఏడుపు విని అల్లాడిపోతోంది.  తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది. అందుకే అమ్మ పిచ్చి తల్లి.

 

మనం తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తుంది.ఏం నాన్నా.. !ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏమైపోతుంది..రా.. ఓ ముద్ద తిందువుగాని అంటుంది తప్ప, అర్ధరాత్రిదాకా ఎక్కడ తిరిగొస్తున్నావురా అని ప్రశ్నించదు. అందుకే అమ్మ ఓ అమాయకురాలు. పరీక్షల్లో తప్పామనే కోపంతో నాన్న తిడుతుంటే, పోనీలే ఈ సారి కాకపొతే వచ్చే ఏడాది చదివి పాసవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది. మనల్ని ముందు ఉండి నడిపించడమే కాకుండా వెనుక ఉండి ప్రోత్సహిస్తుంది. 

 

చిన్నపుడు మనకి లాలీ.. లాలీ అని ముద్దు పాట పాడి మనల్ని నిదురముంచుతుంది.   సంగీత, సాహిత్య పరంగాను , మాధుర్యంలోనూ అమ్మ లాలి పాటకు మించింది ఏముంది? ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్ర పుచ్చగలడు? అందుకే అమ్మ సంగీత కళానిధి. స్కూలు ఫీజులు కట్టాలన్నా, మనకు ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా, బలాదూర్ తిరుగుళ్లకు డబ్బు కావాలన్నా మన తరఫున నాన్నతో నానా తిట్లు తిని అవసరాలు, సరదాలు తీరుస్తుంది... అందుకే అమ్మ రాయబారి. మనం ఏదన్నా తప్పు చేస్తే మనల్ని మందగిస్తుంది అప్పుడు అమ్మలో ఒక గురువు కనపడతాడు.

 

మనం అల్లరి చేసినపుడు, అమ్మని విసిగించినపుడు, మారం చేసినపుడు కోపగించుకోకుండా ఉండే సహన మూర్తి అమ్మ. తాను తిన్న తినకపోయినా బిడ్డల ఆకలి తీర్చడానికి ఒక్కోసారి పస్తులు ఉంటుంది  అందుకే త్యాగమూర్తి అమ్మ. ఇన్ని లక్షణాలు ఒకే ఒక్క అమ్మలో మాత్రమే మనం చూస్తాము. అందుకే అమ్మ దేవత అయింది. దేవుడికి దండం పెడితే వరాలు ఇస్తాడో లేదో తెలియదు కానీ మన అమ్మ మాత్రం అడగకపోయినా వరాలు ఇస్తుంది.. అలాంటి అమ్మ ఋణం మనం ఎలా తీర్చుకుంటాము.. ప్రాణం లేని ఫోనుతో 10 గంటలు గడుపుతాము. ప్రాణం పోసిన అమ్మతో 10 నిముషాలు గడుపలేమా మిత్రమా... !!అమ్మ కళ్ళలో ఆనందాన్ని చూద్దాం.. !

మరింత సమాచారం తెలుసుకోండి: