ఈ కాలంలో గర్భిణీ స్త్రీ నార్మల్ గా ప్రసవం అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. అయితే ఆరోగ్య రీత్యా, ఇతర కారణాల వలన ఆపరేషన్ చేసి బిడ్డను తియ్యాల్సివస్తుంది.
నేటితరంలో కొందరు ఆమ్మో ఆ నొప్పులు మేము భరించలేము అని ఆపరేషన్ కావాలని కోరుకుంటున్నారు. కానీ సహజంగా జరిగే డెలివరీ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ ప్రసవ వేదన ఎక్కువ లేకుండా, సునాయాసంగా కనవచ్చని మన పూర్వికులు రుజువు చేశారు.
సహజమైన డెలివరీ వల్ల పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ బాగా ఉంటుంది. ప్రసవం తరువాత కోలుకోవటం సులభం. శరీరంలో సహజంగా నొప్పిని తగ్గించే హార్మోన్లు విడుదలవుతాయి. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండేపని లేదు. మరి ఇన్ని లాభాలున్నప్పుడు సహజమైన డెలివరీ ఎవరు ఒద్దనుకుంటారు?సహజమైన డెలివరీ కావాలంటే, కొన్ని చిట్కాలు, ఆరోగ్య సూత్రాలు, వ్యాయామాలు పాటించాలి. అనవసరమైన ఒత్తిడి, నెగెటివ్ గా ఆలోచించటం, ఆందోళన పడటం అస్సలు పనికిరాదు. మనసు నిర్మలంగా, హాయిగా ఉంచుకోండి. దానికి ధ్యానం చెయ్యడం, మీకిష్టమైన సంగీతం, పాటలు వినడం, మంచి పుస్తకాలు చదవడం, మంచి దృశ్యాల్ని ఊహించుకోవడం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. మిమ్మల్ని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునే స్నేహితుల, సన్నిహితుల సాంగత్యంలో గడపండి.
మీకు ఎప్పుడన్నా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంటే, టబ్ లో నీళ్లు నింపుకుని జాగ్రత్తగా పడుకోండి, శరీరానికి హాయిగా ఉండి, ఒత్తిడి తగ్గుతుంది. షవర్ కూడా బాగా ఉపకరిస్తుంది.వాళ్ళు, వీళ్ళు ఒక్కోసారి తెలిసో, తెలీకో కొన్ని కష్టతరమైన ప్రసవాలని గురించి చెప్తూ ఉంటారు. విషాదకరమైన విషయాలు వినకండి. ఎక్కడో నూటికో, కోటికో ఒక్క డెలివరీ కొన్ని అనివార్య కారణాలవల్ల విషాదం సంభవించవచ్చు.
కానీ మనకి ఏమీ కాదు, అని గట్టిగా మనసులో అనుకోవాలి.భయాన్ని, బెరుకుని పోగొట్టేది జ్ఞానం. భయం అనవసరం. ఇంట్లో ఉన్న పెద్దలతోనో, అమ్మతోనో చర్చించండి. తెలివిగా ముందుగానే కాస్త వాకబు చేసుకుని, తగిన డాక్టర్ని ఎన్నుకుని, ముందు నించే పరీక్షలు చేయించుకుని, రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవాలి. గర్భిణీలు ఎక్కువ నీళ్లు తాగితే, సహజమైన డెలివరీ సాధ్యం. శరీరానికి, నరాలకు సత్తువనిచ్చేది నీళ్ళే. సమస్య లేకుండా సహజమైన ప్రసవం జరగాలంటే, ప్రతి రోజు పళ్ళ రసాలు, మంచి నీళ్లు సంవృద్ధిగా తాగాలి.