ఆడవాళ్ళ ముఖం అందంగా ఉన్నప్పటికి ఈ  మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతూ  ఉంటారు.అందుకే  వీటికి అనేక రకములైన క్రీంలు వాడతారు ఫలితంగా చర్మం పాడైపోతుంది. అలాకాకుండా ఉండాలంటే మన ప్రకృతిలో సహజంగా లభించే  వాటితో మన ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలు తగ్గించుకోవచ్చు. అది ఎలానో చూద్దాం.. గంధంలో చర్మానికి మేలు చేసే సుగుణాలెన్నో ఉన్నాయి. చర్మ ఛాయను మెరుగుపరచడం, మొటిమల్ని అదుపులో ఉంచడం వంటి లక్షణాలు గంధంలో ఉన్నాయి. మరి గంధాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 

 


పాలలో గంధం చెక్కని అరగదీసి దానికి కాస్త పంచదార కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి సవ్య అపసవ్య దిశల్లో మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. సూర్యకిరణాల తాకిడికి ఎండ తగిలే శరీర భాగాలు రంగు మారుతుంటాయి. ఇలాంటప్పుడు పావుకప్పు గంధం పొడి, పావుకప్పు రోజ్ వాటర్, అరచెక్క నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా కనీసం రెండు సార్లయినా చేస్తుంటే సమస్య దూరమవుతుంది.

 

 


ముఖంపై మొటిమల తాలూకా మచ్చలు కలవరపెడుతుంటాయి. అలాంటివారు గంధం పొడిలో చెంచా పాలు, రెండు చుక్కల తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. ఆరాక కొన్ని నీళ్లు తీసుకుని తడుపుతూ మృదువుగా మర్దనా చేయాలి. తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య త్వరగా దూరమవుతుంది. ముఖం తాజాగా కనిపిస్తుంది. బ్లాక్ హెడ్స్ ఉన్నవారు గంధం పొడిలో చెంచా పసుపు, కర్పూరం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత కడిగివేయాలి. బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు రాసుకుని ఉదయాన్నే శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్య తొలగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: