ఒకేమారు ఇద్దరు బిడ్డలకు తండ్రి లేదా తల్లి అయితే ఇంకేముంది అదే చాలా మందికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక ఆడ బిడ్డ, ఒక మగ బిడ్డ అయితే మరీ ఆనందం. ఎవరు ఏమన్నా ఇది మన సమాజంలో ఉన్న పరిస్థితి. ఇలా ఇద్దరు పిల్లలు ఒకే మారు జన్మించడాన్ని కవలలు అని అంటాం.కవలలు వాళ్లు ఒక ఆడ, ఒక మగ కావచ్చు.. ఇద్దరు ఆడ కావచ్చు.. ఇద్దరు మగ కావచ్చు. కవలలు అందరికీ పుట్టరు. కావాలనుకుంటే పుట్టరు.ఒక్క గర్భాశయంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఎలా తయారవుతారు అన్న సందేహం చాలామందికి వస్తుంది. అది ఎలా సాధ్యమో ఒకసారి తెలుసుకుందాం..
అసలు పిల్లలు పుట్టాలంటే కావాల్సింది ఏంటి? ఆడవారి నుంచి విడుదలయ్యే అండం, మగవాళ్ల నుంచి విడుదలయ్యే శుక్రకణం. ఈ రెండు ఫలదీకరణం చెందడం వల్లనే పిండం తయారవుతుందని తెలుసు కదా. ఇంకాస్త లోతుకు వెళ్తే.. ఆడవాళ్లకు నెలకు ఒక అండం మాత్రమే విడుదలవుతుంది. అండం విడుదల అయిన సమయంలో వీర్యకణాలు అండంతో ఫలదీకరణం చెందుతాయి. అయితే.. కొంతమంది ఆడవాళ్లకు ఒక్కోసారి రెండు అండాలు విడుదలవుతాయి. ఆ రెండు అండాలు రెండు వేర్వేరు వీర్యకణాలతో ఫలదీకరణం చెందుతాయి. ఆ సమయంలో కవలలు పుడతారు. అయితే రెండు వేర్వేరు అండాలు, రెండు వేర్వేరు శుక్రకణాలు కాబట్టి.. ఒక ఆడ ఒక మగ, ఇద్దరు మగ, ఇద్దరు ఆడ పుట్టే అవకాశం ఉంటుంది.రెండు అండాలు విడుదలయితే ఇద్దరు పిల్లలు.రెండు కంటే ఎక్కువ అంటే మూడు అండాలు విడుదలయితే ముగ్గురు పిల్లలు. ఈ మూడు అండాలు, మూడు వీర్యకణాలతో ఫలదీకరణం చెందితే ముగ్గురు పిల్లలు పుడతారు.
ఇలా ఎన్ని అండాలు ఫలదీకరణం చెందితే అంతమంది పిల్లలన్నమాట.ఒకే పోలికతో ఎలా పుడతారు అంటే… అందరు కవలలు ఒకే పోలికతో ఉండరు. రెండు వేర్వేరు అండాల ద్వారా ఏర్పడిన పిండాలకు ఒకే రూపు తక్కువగా ఉంటుంది. కానీ అండం ఫలదీకరణం చెందినా రెండు భాగాలుగా విడిపోతుంది. అంటే అండం ఒకటే.. కానీ అది రెండు భాగాలుగా విడిపోవడం వల్ల ఇద్దరు పిల్లలు ఒకే రూపంతో పుడతారన్నమాట.కుటుంబంలో ఇది వరకు ఎవరికైనా కవలలు పుట్టి ఉంటే.. తర్వాత తరాల వారికి కూడా కవలలు పుట్టే అవకాశం ఉంది.