ప్రస్తుతం కాలం మారిపోయింది.ఆడవాళ్లు అంతా బిజీబిజీగా మారిపోయారు. పని, హాబీలు, భర్త, పిల్లలు, స్నేహితులు.. ఇలా మనం సమయం కేటాయించాల్సిన అంశాలు, అవసరాలు ఎన్నో.. ఎన్నెన్నో.. ఈ బిజీ లైఫ్‌లో రోజూ జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేసే సమయం చాలామందికి ఉండదు. బరువు తగ్గాలని చాలామంది భావిస్తారు.కానీ దానికి జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేసే సమయం మాత్రం ఉండదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారా? జిమ్ కి వెళ్లకుండానే బరువు తగ్గిపోవచ్చు. మరి, అవేంటో చూసేద్దాం రండి.
ఇంటి పనులన్నీ పనిమనిషికి అప్పగించి మీరు చక్కగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తే బరువు తగ్గిపోరు. అందుకు కాస్త ఒళ్లు వంచాల్సి ఉంటుంది. దీనికి మీ పనిమనిషిని పూర్తిగా మాన్పించాల్సిన అవసరమేమీ లేదండోయ్..! మీకు దొరికిన కాస్త ఖాళీ సమయంలో మీరు చేయగలిగే పనులు ఎంచుకొని వాటిని పూర్తిచేస్తే సరిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటూ రోజూ మూడు మీల్స్‌ని తినాలని పెద్దలు చెప్పారంటే దానికో కారణం ఉంటుందని గుర్తుంచుకోండి. వీటి మధ్యలో మీరు మళ్లీ ఏదైనా హెవీగా తింటే కొవ్వు పేరుకుపోతుంది.
అయితే మీరు ఆరు చిన్న చిన్న మీల్స్ తినే డైట్‌లో ఉంటే తక్కువ మోతాదులో తినడం అలవాటు చేసుకోవాలి.మీరు తినే వస్తువుల్లోనూ ఆయిలీ ఫుడ్ కాకుండా ఆరోగ్యకరమైనవి ఎంచుకుంటే మంచిది. చాలామంది రాత్రిపూట భోజనం చేయడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల మీరు తిన్న ఆహారం పడుకోకముందే అరిగి దాన్ని శక్తిగా మార్చుకునేందుకు శరీరానికి ఏమాత్రం సమయం ఉండదు. దీనివల్ల రాత్రి తిన్న భోజనం ద్వారా వచ్చే శక్తిని శరీరం కొవ్వుగా దాచి ఉంచుతుంది. అందుకే రాత్రి నిద్రపోవడానికి కనీసం మూడు నాలుగు గంటల ముందే ఆహారం తీసుకునే ప్రయత్నం చేయండి.
ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిన్న చిన్న పనులకు కూడా వాహనాలు ఉపయోగించడానికి బదులుగా నడవడం మంచిది. ఉదాహరణకు పాలు లేదా ఏవైనా సరుకులు తీసుకురావడానికి, షాపుకి వెళ్లడానికి, నడవడం వల్ల కొన్ని క్యాలరీలు కూడా కరుగుతాయి.నడక మీ శరీరానికి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు మీ బరువు కూడా తగ్గిస్తుంది.కప్‌కేక్‌లు, చాక్లెట్లు, బిస్కట్లు ఇలా నచ్చిన ఆహారం తినాలనే ఆశ ఎవరికైనా ఉంటుంది.కానీ వీటిని తరచూ తినడం వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. మూడ్ బాగోలేనప్పుడు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మంచిది.పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ప్రధానం అని అందరికీ తెలుసు. అవి మంచి ఆరోగ్యకరమైన ఆహారంగా ఉపయోగపడడంతో పాటు జీవక్రియలను వేగవంతం చేస్తాయి.