ఆడవాళ్లు ఏది చేసిన మన మంచికే.. ఎందుకంటే కుటుంబాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ముందుకు నడపడంలో మహిళ పాత్ర ఎక్కువ కాబట్టి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. కారణం ఉంది. ఆడవాళ్లు వంటల్లో ఏమి వేసి వంట చెసిన అది మన మంచికే. అయితే ఆడవాళ్లు కూరల్లో కరివేపాకు మంచిదని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ చాలామంది ఆ కరివేపాకును తీసిపారేస్తారు. కొందరయితే ఆ.. ‘కరివేపాకే కదా’ అంటూ చిన్నచూపు చూస్తారు. అయితే కరివేపాకు యొక్క ఉపయోగాలు తెలిస్తే అస్సలు కరివేపాకును పారేయరు. కరివేపాకు ఆరోగ్యానికి, అందానికి చాలా మంచిది తెలుసా.. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు.అలాగే ఆడవాళ్ల అందాన్ని పెంచడానికి కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది.
కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి.తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి. పూర్వమయితే కరివేపాకు పొడులు, కరివేపాకు పచ్చడి అంటూ కరివేపాకు వినియోగం కొంచెం ఎక్కువగానే వుండేది.
అలాగే స్థూలకాయంతో బాధపడే ఆడవాళ్లు ప్రతి రోజూ ఉదయం పది కరివేపాకుల చొప్పున మూడు నెలల పాటు తింటే బరువు తగ్గుతారు. ఆరోగ్యానికే కాదు.. అందానికీ కరివేపాకుని వాడతారు. కురులకి ఈ ఆకు ఎంతో మంచిదట. కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. అలాగే జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. అంతేనా... జుట్టు తెల్లబడటం తగ్గి, కురులు నల్ల దనాన్ని సంతరించుకుంటాయి. ఇలా ఆరోగ్యానికి, అందానికి ఎంతో మంచిది అని నిపుణులు గట్టిగా చెబుతున్న కరివేపాకుని తరచూ ఏదో ఒక రూపంలో తప్పక తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు కరివేపాకు ను తీసుకోవడం చాలా మంచిది.