
ఆమెతోపాటు గత ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన మెలానీ మోర్గాన్, డెవ్రా ఎంటెన్‌మ్యాన్.. ఈ ఎన్నికల్లో కూడా గెలుపొందారు. వీరు ముగ్గురే కాక మరో ముగ్గురు నల్లజాతి స్త్రీలు ఈసారి ఎన్నికల్లో గెలుపొందారు. వారే జమిలా టేలర్, ఏప్రిల్ బెర్గ్, కిర్‌స్టన్ హ్యారీస్. ఇలా ఒకే ఎన్నికల్లో ఆరుగురు నల్లజాతీయులు అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో గెలుపొందడం ఇదే తొలిసారట. వీరి జాతి, మతాల వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. కానీ ఇది మాత్రం మహిళల విజయమే అని అంటున్నారు విశ్లేషకులు.
వాషింగ్టన్‌లో కాంగ్రెస్‌కు నల్లజాతి వారిని ఎన్నుకోవడం కూడా ఇదే తొలిసారి. ఇక్కడి 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో టకోమా మాజీ మేయర్ మారిలిన్ స్టిక్‌ల్యాండ్ విజయం సాధించారు. ‘‘తక్కువ మంది నల్లవారు గెలిస్తే.. వారు గళం విప్పినా దాన్ని ఎవరూ పట్టించుకోరు. అదే ఇలా ఎక్కువ మంది నల్లజాతీయులు గనుక ఎన్నికల్లో నెగ్గితే వారి స్వరానికి ఓ శక్తి వస్తుంది’’ అని నల్లజాతి మహిళల గెలుపు కోసం పనిచేసే పొలిటికల్ యాక్షన్ టీమ్ సహ వ్యవస్థాపకురాలు అలెక్సిస్ టుర్లా పేర్కొన్నారు.
మే నెలలో జార్జి ఫ్లాయిడ్ మృతి తర్వాత నల్లజాతీయులకు భారీగా మద్దతు పెరిగిందని, జాతిసమానత్వం గురించి చాలామంది ఆలోచించడం ప్రారంభించారని కొందరు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈసారి అగ్రరాజ్యం ఎన్నికల్లో నల్లజాతీయులు కీలక పాత్ర పోషించారని అనడానికి వీరి విజయాలే నిదర్శనమని విశ్లేషకుల మాట.