టాలీవుడ్ లో ఉత్తరాది అమ్మాయిలదే హవా అని టాక్. చాలా మంది ఉత్తరాది అమ్మాయిలు మన తెలుగింట పెద్ద స్టార్లు అయిపోయారు. దీంతో మనం లోకల్ టాలెంట్‌ను పట్టించుకోవడం లేదనే కంప్లయింట్ కూడా ఉంది. అయితే ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించ వచ్చని నిరూపిస్తోంది ఓ తెలుగమ్మాయి. ఆమే అమ్రీన్. తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు నిర్మించిన సాజిద్ ఖురేషీ కుమార్తె ఈమె. ప్రస్తుతం హిందీ భాషలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది.

తనకు చిన్నప్పటి నుంచి  బిజినెస్ చేయాలనే కోరిక ఉండేదన్న అమ్రీన్.. అందుకే బీబీఏ కూడా పూర్తి చేసిందట. అయితే ఓ సారి తండ్రితో కలిసి ఢిల్లీ వెళ్తుంటే ఆమె వైపు తిరిగి ‘నువ్వు హీరోయిన్ ఎందుకు కాకూడదు?’ అని అడిగాడట ఆయన. ఆ మాటలే అమ్రీన్ కు ప్రేరణ కలిగించాయట. ఆ తర్వాత తెలుగులో సూపర్ హిట్ అయిన ‘సినిమా చూపిస్త మావ’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారని, హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోవాలని అనుకుంటున్నారని తెలియడంతో అక్కడకు వెళ్లింది.

ఎందుకైనా మంచిదని ఆ సినిమాను తెలుగులో నాలుగైదు సార్లు చూసి మరీ వెళ్లిందట అమ్రీన్. అయితే ముంబైలో డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి మాత్రం.. వేరే ఏదో సినిమాలో సీన్స్ ఇచ్చి యాక్ట్ చేయమని చెప్పాడు. అయినా సరే ఆమె చక్కగా నటించింది. అమ్రీన్ నటన బాగా నచ్చిన రాజ్ కుమార్.. ఆమెనే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాతే ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది అమ్రీన్. ఈ వార్త విని ఆశ్చర్యపోయిన అమ్రీన్ తండ్రి సాజిద్.. ఆల్ ది బెస్ట్ చెప్పాడట.

సినిమా షూటింగ్ కొన్ని పాటలు మినహా పూర్తయింది. ఈ క్రమంలో అప్పటి వరకు పూర్తయిన సినిమాను తండ్రికి చూపిస్తే.. ఆయన కళ్లలో నీళ్లు తిరిగియాని, ‘ఓ ప్రేక్షకుడిగా చెప్తున్నా.. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’ అని చెప్పాడని సంతోషంగా చెప్తోంది అమ్రీన్. మరి మన తెలుగమ్మాయి హిందీలో హిట్ కొడుతుందో లేదో వెయిట్ అండ్ సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: