
ఇక ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువ పాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు వగైరా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక గర్భం దాల్చిన మొదటి ఆరునెలలు.. నెలకొకసారి, ఏడు - ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు, తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము. సొంతముగా మందులు వాడడము, ఎక్సరేలు తీయించుకోవడము చేయకండి. ఎత్తు మడమల చెప్పులు వాడకూడదు అని నిపుణులు చెబుతున్నారు. ఇక గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.
ఇక గర్భం దాల్చిన మొదటి మూడునెలలు, చివరి నెలలో దూరప్రయాణాలు, కారు స్కూటరు నడపడము, చేయరాదు. ఇక రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు తిరిగి పడుకోవాలి. స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్యనభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును. ధనుర్వాతం బారినుండి రక్షణ కోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్‌లు తీసుకోవాలి. రక్తస్రావము, ఉమ్మనీరు పోవడము, శిశువు కదలిక తగ్గినట్లు అనిపించినప్పుడు, కడుపు నొప్పి వచ్చినా వైద్యులను సంప్రదించాలని తెలిపారు.