సృష్టికి మూలం అమ్మ. తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ గుండెల్లో పెట్టుకుని పెంచుతుంది అమ్మ. బువ్వపెట్టి, బుజ్జగించి, లాలించి, పాలించి.. తన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేసేంత వరకు విశ్రమించదు అమ్మ. అమ్మ అనే రెండక్షరాలలోని మాధుర్యాన్ని పొందాలంటే ఎన్ని జన్మలెత్తినా తనివి తీరదు.  ప్రపంచంలో మనకు లభించే అన్ని ప్రేమల కన్నా అమ్మ ప్రేమ విలువైనది. అటువంటి అమ్మ ప్రేమకు ఈ రోజుల్లో ఎంతో మంది దూరంగా బ్రతుకుతున్నారు. అమ్మ మనకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి, తాను సరిగా తిండి తినక పోయినా మనకు కడుపునిండా అన్నం పెట్టి చదివించి ఒక ప్రయోజకుడిని చేస్తుంది.  అలాంటిది చాలా మంది ఈ ప్రపంచంలో ఒక మంచి స్థానంలోకి వచ్చాక పెళ్లి చేసుకుని హాయిగా అమ్మకు దూరంగా బ్రతుకుతున్నారు. మనకోసం సర్వం ధారబోసిన అమ్మను మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. అందరూ ఇలాగే ఉంటారు అని అనడం లేదు. ఎక్కువ మంది ఇలానే ఉంటారు అని ఖచ్చితంగా చెప్పగలము.  

ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో తల్లిదండ్రులతో గడిపేందుకు తగిన సమయం కేటాయించలేకపోతున్నాం. వృద్ధాప్యంలో వారి ఆలనాపాలనా చూడలేకపోతున్నాం. మరి మనం చేసేది కరెక్టేనా..? అని ప్రతి ఒక్కరూ గుండె మీద చేయి వేసుకుని ప్రశ్నించుకుంటే వారికే అర్ధం అవుతుంది. వారు ఎంత తప్పు చేస్తున్నారా అని. వారిని దూరంగా ఎక్కడో వదిలేసి మీ సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోవడం ఎంతవరకు ధర్మం. బ్రతికినంత కాలం అమ్మ నాన్న మీ బాగు కోసం ఆలోచిస్తూ ఉంటారు. మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండాలని కోటి దేవుళ్ళకు మొక్కుకుంటారు. అటువంటి అమ్మను వదిలేసి మీరు ఏమిసాధిస్తారు. తల్లిదండ్రులు జీవించి ఉండగానే మనసారా సేవించి మనబాల్యంలో వారు పంచిన ఆప్యాయతానురాగాలను తిరిగి పంచి కన్నవారి ఋణం తీర్చుకోండి. కాలం కరిగిపోయిన తరువాత ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు గుర్తుంచుకోండి. 

ఈ సృష్టిలో అమ్మకన్నా విలువైంది ఏదీ లేదు. అందుకే ‘మాతృదేవో భవ’ అని దైవంతో సమానంగా అమ్మను కొలుస్తాం. ఎన్నో పురాణాల్లోనూ కథల్లోనూ ఉంది అమ్మను మించిన దైవం ఈ లోకంలో ఏదీ లేదు. కాబట్టి వారికి ఉన్నతస్థానాన్ని ఇవ్వండి. వారిని సంతోషంగా చూసుకోండి. వారు జీవితమంతా అందంగా ఉండేలా ప్రణాళికలు చేయండి. అటువంటి కనిపెంచిన అమ్మ ప్రేమను గుర్తుకు తెచ్చుకోవడం కోసం, కన్నతల్లిని ఆనందంగా ఉంచడం కోసం ‘మాతృదినోత్సవం’ పేరుతో ప్రతి సంవత్సరం ఒక అపూర్వమైన రోజును మనము జరుపుకుంటున్నాము. నవ మాసాలూ మోసి, కంటికి రెప్పలా కాపాడిన అమ్మపై గౌరవాన్ని ఒక్కరోజుకు పరిమితం చేయలేం. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆడ‌త‌నం దేశానికి ఒక‌లా ఉన్నా.. అమ్మ‌త‌నం మాత్రం ఎక్క‌డైనా ఒకేలా ఉంటుంది. అమ్మా...మీరు ఎనలేని గౌరవానికి పాత్రులు. ఈ ఆర్టికల్ ను చూసి ఈరోజుకి మీ తల్లితండ్రులను వదిలేసిన వారు అంతా వారిని ప్రేమతో దగ్గరకు తీసుకుంటారని ఆశిస్తున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: