రాజస్థాన్‌లోని హనుమాఘర్‌కు చెందిన సహదేవ్ సహరన్ ఒక సాదాసీదా రైతు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈయనకు ఐదుగురు ఆడపిల్లలు. వీరికి రోమా, మంజు, అన్షు, రీతు, సుమన్ అని పేర్లు పెట్టారు. తనకు కొడుకులు లేరని సహదేవ్ ఏనాడూ కుంగిపోలేదు. అయితే తనకు కలెక్టర్ కావాలన్న కోరిక ఉండగా... ఆ విషయాన్ని తన కుమార్తెలకు చెప్పారు. తన కోరిక నెరవేర్చాలంటూ మనసులోని మాట బయటపెట్టారు. దీంతో తండ్రిని అర్థం చేసుకున్న తనయలు.. ఎంతో కష్టపడి చదివారు. ఐదుగురు ఆడపిల్లలు ఉన్నత చదువులు చదవడమే కాకుండా... కలెక్టర్లుగా ఎంపికై తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చి యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారు.
2018లో నిర్వహించిన రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించగా... అందులో అన్షు, రీతు, సుమన్‌లు ఎంపిక అయ్యారు. రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్‌కు ఏకకాలంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎంపిక కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. యావత్ భారతావని దృష్టిని.. తమ వైపునకు ఆకర్షించేలా చేశారు ఈ యువతులు.
సహదేవ్ సహరన్ ఇంట్లో ఇప్పటికే రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా అన్షు, రీతు, సుమన్‌లు కూడా ఆర్‌ఎఎస్‌కు ఎంపిక అయ్యారు. దీంతో సహదేవ్ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండటం విశేషం. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫోటోలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కష్వాన్ షేర్ చేయడంతో అందరికీ ఈ విషయం తెలిసింది. వారిని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.