అయితే ఆంధ్రప్రదేశ్ లోని సీఎం జగన్ సర్కారు అభయహస్తంలో రూ.600 కోట్లు చెల్లించకుండా ఆపేశారు. 2021 సెప్టెంబర్ లో అభయహస్తం పింఛను పథకం నుంచి ఎల్ ఐసీని తప్పించి వాటాదారులు, ప్రభుత్వం సొమ్ము 2500 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకుంది. అయితే పథకం నుంచి వైదొలిగిన వారికి ఇవ్వాల్సిన రూ. 700 కోట్లను ఇవ్వడం లేదు.
తాము కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని వాటాదారులు అధికారులను అడుగుతున్నారు. అయితే దీని గురించి ఏం చేయాలో తెలియని సెర్ప్ అధికారులు లబ్ధిదారుల ఒత్తిడి తట్టుకోలేక బీమా మొత్తంలో నుంచి రూ. 100 కోట్లు తీసి వారికి ఇచ్చేశారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధంగా చేసినా తక్షణం లబ్ధిదారులకు ఇవ్వాల్సిన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇచ్చారు. పథకం నుంచి వైదొలిగిన వారికి అప్పటి వరకు చెల్లించిన సొమ్మును తిరిగి ఇచ్చేయాలని అభయహస్తం నిబంధనలు చెబుతున్నాయి.
ఏడాదిన్నర దాటిన లబ్ధిదారుల పూర్తి సొమ్ము చెల్లించలేదు. ప్రత్యేక ఖాతా ఒపెన్ చేసి అందులో సొమ్ము జమ చేశామని చెబుతున్నారు. తమ డబ్బులను ప్రభుత్వం అట్టిపెట్టుకోవడం ఏమిటని లబ్ధిదారులు మండి పడుతున్నారు. డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు 2009 నుంచి 2018 వరకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకంలో సభ్యులు ఏడాదికి రూ. 365 చెల్లిస్తే మరో రూ.365 ప్రభుత్వం చెల్లించాలి.